World Cup: నీ మౌనం ప్రశంసనీయం విలియమ్సన్... కివీస్ సారథిపై రవిశాస్త్రి ప్రశంసల వర్షం
- వరల్డ్ కప్ ఫైనల్లో ఐసీసీ నిబంధన కారణంగా రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్
- ఓటమిని హుందాగా స్వీకరించిన విలియమ్సన్
- ట్వీట్ చేసిన రవిశాస్త్రి
వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ తో చివరి బంతి వరకు హోరాహోరీగా పోరాడిన న్యూజిలాండ్ జట్టు ఐసీసీ నిబంధన కారణంగా రన్నరప్ తో సరిపెట్టుకుంది. దీనిపై కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఎంతో హుందాగా వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఐసీసీ బౌండరీల నిబంధన అసంబద్ధంగా ఉన్నాగానీ, విలియమ్సన్ ఒక్క మాటా అనకపోవడంపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా అభినందించాడు. వరల్డ్ కప్ వంటి మెగాఈవెంట్ లో గెలుపు కొద్దిలో చేజారినా, విలియమ్సన్ చూపిన సంయమనం అద్భుతమని కొనియాడాడు. ఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత రెండ్రోజుల పాటు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా నువ్వు పాటించిన మౌనం చాలా గొప్పగా ఉంది. ఎంతో సంక్లిష్టమైన పరిస్థితిలో నువ్వు చూపించిన ఓర్పు చిరస్థాయిగా నిలిచిపోతుంది.. అంటూ అభినందించారు. ఈ మేరకు శాస్త్రి ట్వీట్ చేశారు.