Hafeez Saeed: హఫీజ్ సయీద్ అరెస్టుపై ట్రంప్ వ్యాఖ్యలతో విభేదించిన యూఎస్ స్టాండింగ్ కమిటీ
- ఉగ్రనేతను అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన పాక్
- హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- పాక్ ప్రకటనపై సందేహాలు వ్యక్తం చేసిన యూఎస్ స్టాండింగ్ కమిటీ
కరుడుగట్టిన ఉగ్రనేత హఫీజ్ సయీద్ ను అరెస్ట్ చేసినట్టు పాకిస్థాన్ ప్రకటించగానే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేయడం తెలిసిందే. రెండేళ్లుగా తాము ఒత్తిడి చేస్తుండడంతోనే హఫీజ్ ను పాక్ అదుపులోకి తీసుకుందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, యూఎస్ స్టాండింగ్ కమిటీ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యాఖ్యానించింది. హఫీజ్ సయీద్ అరెస్ట్ విషయం నమ్మశక్యంగా కనిపించడంలేదని, ఇప్పటికి అతడ్ని ఎన్నోసార్లు పట్టుకుని వదిలేశారని కమిటీ ఆరోపించింది. హఫీజ్ సయీద్ కు శిక్ష పడితే తప్ప ఈ విషయాన్ని నమ్మలేమని తెలిపింది. అంతేగాకుండా, ట్రంప్ చేసిన ట్వీట్ ను కోట్ చేస్తూ, మన ప్రశంసల్ని మనతోనే ఉంచుకుందాం అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించింది.