Telangana: స్కూలుకు వెళ్లనని పిల్లాడి మారాం.. బెదిరించడానికి ఏకంగా పోలీసులను పిలిపించిన తల్లి!
- తెలంగాణలోని జడ్చర్లలో ఘటన
- 100 నంబర్ కు ఫోన్ చేసిన మహిళ
- హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు
పిల్లలు కొన్నికొన్ని సార్లు స్కూలుకు వెళ్లబోమని మారాం చేస్తుంటారు. అప్పుడు తల్లిదండ్రులు నయానో, భయానో పిల్లలను ఒప్పించి పాఠశాలకు పంపిస్తారు. కానీ ఓ పిల్లాడు స్కూలుకు వెళ్లకపోవడంతో అతని తల్లి ఏకంగా పోలీసులకు ఫోన్ చేసి పిలిపించింది. వెంటనే తమ ఇంటికి రావాలనీ, సమస్య ఉందని ఫోన్ లో అడ్రస్ చెప్పింది. దీంతో ఏదో ఎమర్జెన్సీ కేసు అనుకుని కారులో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు అసలు కారణం విని అవాక్కయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని జడ్చర్లలో చోటుచేసుకుంది.
మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్లకు చెందిన మహిళ ఈరోజు పోలీసుల టోల్ ఫ్రీ నంబర్ 100కు ఫోన్ చేసింది. దీంతో పోలీస్ సిబ్బంది అక్కడకు హుటాహుటిన చేరుకుని, ఏమయిందని ప్రశ్నించగా..‘నా కొడుకు స్కూలుకు పోనని మారాం చేస్తున్నాడు. ఎంత చెప్పినా వినడం లేదు. సాయం చేయండి సార్’ అని చెప్పింది. దీంతో టెన్షన్ టెన్షన్ గా వచ్చిన పోలీసులు విషయం తెలుసుకుని నవ్వుకున్నారు.