Tirumala: చంటి బిడ్డల తల్లిదండ్రులకు, వృద్ధులకు ఆఫర్... తిరుమలలో ప్రత్యేక దర్శనాల అదనపు కోటా వివరాలు!
- వేసవి రద్దీ దృష్ట్యా రద్దయిన సుపథం ప్రవేశాలు
- తిరిగి పునరుద్ధరించిన అధికారులు
- 23, 24 తేదీల్లో ప్రత్యేక కోటా
వృద్ధులు, ఐదేళ్ల లోపు చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాల కోటాను పెంచినట్టు టీటీడీ పేర్కొంది. నెలలో ఒకరోజు కల్పించే ప్రత్యేక దర్శనాన్ని తిరిగి పునరుద్ధరించినట్టు పేర్కొన్న అధికారులు, ఈ దఫా మరిన్ని టికెట్లు కేటాయించినట్టు తెలిపారు. వేసవి రద్దీ దృష్ట్యా, ఏప్రిల్ నుంచి సుపథం దర్శనాలను రద్దు చేసిన టీటీడీ, తిరిగి వాటిని పునరుద్ధరించింది.
ఈ నెల 23, 24 తేదీల్లో చంటిబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు సుపథం ఎంట్రెన్స్ ద్వారా దర్శనం వుంటుందని, 23వ తేదీన 4 వేల టోకెన్లను జారీ చేస్తామని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు 1000, మధ్నాహ్నం 2 గంటలకు 2 వేలు, 3 గంటలకు వెయ్యి టోకెన్లను ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్ లో పొందవచ్చని తెలిపారు. 24న చంటిబిడ్డల తల్లిదండ్రులను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం ప్రవేశమార్గం ద్వారా అనుమతిస్తామని వెల్లడించారు.