Karnataka: అసెంబ్లీలో కాంగ్రెస్ ను తిట్టిపోసిన కర్ణాటక సీఎం కుమారస్వామి... పెను గందరగోళం!

  • సభ్యులను కాపాడుకోలేక పోయిన కాంగ్రెస్
  • ఐదారు కోట్లు ఇస్తుంటే ఎలా కాపాడుకోవాలన్న కుమారస్వామి
  • జానెడు పొట్టకోసం దిగజారుడు రాజకీయం ఎందుకన్న స్పీకర్

నేడు విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిన కర్ణాటక సీఎం కుమారస్వామి అసెంబ్లీలో చేసిన ప్రసంగం తీవ్ర దుమారాన్ని రేపింది. ఇప్పటికీ 15 మంది కాంగ్రెస్, రెబల్ ఎమ్మెల్యేలు ముంబైలోనే ఉండటంతో, విశ్వాస పరీక్షకు ముందే కుమారస్వామి సర్కారు మైనారిటీలో పడిపోగా, ఈ ఉదయం సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ సభ్యులను ఆ పార్టీ నేతలు కాపాడుకోలేకపోయారని విమర్శించారు.

తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ముళ్లపైనే కూర్చున్నానని, ఆ ముళ్లన్నీ కాంగ్రెస్ వేనని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ భావించడం లేదని నిప్పులు చెరిగారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ, కుమారస్వామి వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీంతో జేడీ(ఎస్), కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సభలో పెను గందరగోళం ఏర్పడింది. బీజేపీ అధిష్ఠానం ఒక్కో ఎమ్మెల్యేకు ఐదారు కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తోందని, వారిని ఎలా కాపాడుకోగలమని కొందరు కాంగ్రెస్ నేతలు మాట్లాడటం గమనార్హం.

ఈ గందరగోళంపై స్పీకర్ మాట్లాడుతూ, రెబల్ ఎమ్మెల్యేల తీరు ఏ మాత్రం సరికాదని అన్నారు. ఎంత సంపాదించినా జానెడు పొట్ట కోసమేనని, దాని కోసం దిగజారుడు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. సభలోని రెండు వర్గాలకూ నైతిక విలువలు లేవని మండిపడ్డారు. అసెంబ్లీలో గందరగోళం కొనసాగుతోంది. గవర్నర్ ఆదేశాల ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు విశ్వాస పరీక్ష జరిగితే కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడం ఖాయమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News