economic development: డాలర్లు ఆకాశం నుంచి ఊడి పడవు : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఘాటైన వ్యాఖ్యలు
- ఆర్థికాభివృద్ధిపై మంత్రి నిర్మలాసీతారామన్ వ్యాఖ్యలకు కౌంటర్
- ఐదు ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ అప్పటికప్పుడు ఏర్పడదు
- గత ప్రభుత్వాల పనితీరుపై ఆధారపడి ఉంటుంది
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ’ వ్యాఖ్యలపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ 2024 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు ఎదుగుతుందన్నారు. దీనిపై ప్రణబ్ ఘాటైన విమర్శలే చేశారు. ఆర్థికాభివృద్ధి అప్పటికప్పుడు వచ్చేది కాదని, డాలర్లు ఏమీ స్వర్గం నుంచి ఊడిపడవన్నారు.
గత ప్రభుత్వాల పనితీరువల్లే ఇది సాధ్యపడుతుందని చెప్పారు. అందువల్ల అభివృద్ధి సాధ్యమైతే గత ప్రభుత్వాలకు కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. సున్నా నుంచి 1.8 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ అన్న విషయం ప్రస్తుత పాలకులు గుర్తు చేసుకోవాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన పునాదులు వేసి ప్రణాళికాబద్ధంగా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. ఇందులో ప్లానింగ్ కమిషన్ కృషి కూడా ఉందని ప్రణబ్ వ్యాఖ్యానించారు.