Andhra Pradesh: ఊరిలో చిచ్చుపెట్టిన ‘గ్రామ వాలంటీర్’ పోస్టు.. బట్టలు ఉతకరాదని తీర్మానించిన రజకులు!
- శ్రీకాకుళం జిల్లాలోని బీటీ వాడలో ఘటన
- తమ కులస్తుడికి పోస్టు ఇవ్వకపోవడంపై ఆగ్రహం
- ఊర్లో బట్టలు ఉతకబోమని దండోరా వేయించిన రజకులు
ఆంధ్రప్రదేశ్ లో పల్లెల్లోని ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ‘గ్రామ వాలంటీర్’ నియామకాలను ఏపీ ప్రభుత్వం చేపడుతోంది. ఇందుకు భారీ సంఖ్యలో యువతీయువకులు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం బీటీ వాడ గ్రామంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గ్రామ వాలంటీర్ పోస్టును తమ సామాజికవర్గానికి ఇవ్వకపోవడంతో రజకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ కులస్తుడికి కాకుండా మరొకరికి గ్రామ వాలంటీర్ పోస్టును ఇచ్చినందున రేపటి నుంచి గ్రామస్తుల దుస్తులు ఉతకబోమని ప్రకటించారు. ఈ మేరకు బీటీ వాడ గ్రామంలో దండోరా వేయించారు. కాగా, ఈ వ్యవహారంపై అటు గ్రామపెద్దలు, ఇటు ప్రభుత్వ అధికారులు స్పందించలేదు.