Andhra Pradesh: మన ముఖ్యమంత్రి గారి ఘనమైన గత చరిత్ర వల్లే ప్రపంచ బ్యాంక్ వెనక్కి వెళ్లిపోయింది: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల
- అధికారంలోకి రాకముందు జగన్ అవినీతికి పాల్పడ్డారు
- అధికారంలోకి వచ్చాక ‘రద్దుల పర్వం’ మొదలైంది
- ప్రాజెక్టులు, రాజధాని పనులన్నీ ఆగిపోయాయి
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు ఇచ్చేందుకు వెనుకంజ వేసిన విషయం తెలిసిందే. ఇలా ఎందుకు జరిగిందన్న ప్రశ్నకు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మన ముఖ్యమంత్రి గారి ఘనమైన గత చరిత్ర’ వల్లే ప్రపంచ బ్యాంకు వెనక్కి పోయిందని అన్నారు. నాడు జగన్ తన తండ్రిని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకో ద్వారా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘రద్దుల పర్వం’ మొదలు పెట్టారని, జలవనరుల ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయని, రాజధాని నిర్మాణ పనులన్నీ ఆగిపోయాయని, దీంతో, ఇక్కడి నుంచి అందరూ తమ తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోతున్నారని విమర్శించారు. ఈ విషయం ప్రపంచ బ్యాంక్ కు నచ్చలేదేమో, రాష్ట్రం పరిస్థితి ఇలా ఉంటే, భవిష్యత్తులో ఎలా ఉంటుందోనని భావించి, నిధులిచ్చినా వృథా అయిపోతాయనుకుని వాటిని ఆపేసి ఉంటుందని అభిప్రాయపడ్డారు.