Karnataka: కర్ణాటక అసెంబ్లీలో కలకలం రేపిన 'నిమ్మకాయ'!
- చేతిలో నిమ్మకాయతో సభలో ప్రవేశించిన మంత్రి రేవణ్ణ
- చేతబడి అంటూ అనుమానం వ్యక్తం చేసిన బీజేపీ సభ్యులు
- సోదరుడిపై ఆరోపణలు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుమారస్వామి
అసలే డెడ్ లైన్ల మీద డెడ్ లైన్లు పెడుతూ గవర్నర్ టెన్షన్ కు గురిచేస్తున్న వేళ కర్ణాటక అసెంబ్లీలో సీఎం కుమారస్వామికి మరో తలనొప్పి వచ్చిపడింది. సీఎం కుమారస్వామి సోదరుడు, క్యాబినెట్ మంత్రి హెచ్ డీ రేవణ్ణ చేతిలో నిమ్మకాయతో సభలోకి ప్రవేశించడం పట్ల బీజేపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా చేతబడి ప్రయత్నమేనంటూ బీజేపీ సభ్యులు ఆరోపణలతో హోరెత్తించారు.
దీనిపై కుమారస్వామి మండిపడ్డారు. "ఓ నిమ్మకాయ తెచ్చాడని రేవణ్ణను అనుమానిస్తున్నారా! హిందూ సంస్కృతిని నమ్మే మీరే అతడిపై దాడి చేస్తున్నారు. గుడికి వెళుతూ నిమ్మకాయ తీసుకెళ్లడం రేవణ్ణకు అలవాటు. కానీ మీరు అతడిపై చేతబడి ఆరోపణలు చేస్తున్నారు. అయినా చేతబడి చేస్తే ప్రభుత్వం నిలబడేది సాధ్యమేనా?" అంటూ నిప్పులు చెరిగారు.