Telangana: ఎఫ్ఆర్వో అనితపై ఎమ్మెల్యే సోదరుడి దాడికేసు.. తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు
- అనితపై దాడిచేసి గాయపరిచిన ఎమ్మెల్యే సోదరుడు
- ఇది శాంతి భద్రతల సమస్యన్న సుప్రీంకోర్టు
- స్వయంగా పర్యవేక్షిస్తామన్న ధర్మాసనం
ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ అధికారి అనితపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ దాడిని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇది శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యేనని పేర్కొన్న ధర్మాసనం.. ఈ కేసును తామే స్వయంగా పర్యవేక్షిస్తామని తెలిపింది. పర్యావరణానికి సంబంధించి కోర్టుకు సహాయకుడిగా వ్యవహరించే సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు అనిత కేసును ఇటీవల సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దాడి సమయంలో పోలీసుల వద్ద ఏకే-47 తుపాకులు ఉన్నప్పటికీ దాడిని ఆపలేకపోయారని పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమం కింద అటవీకరణ ప్రాజెక్టు పనులు చేపడుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని కోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ తన బలగాన్ని వెంటేసుకుని వెళ్లి అనితపై దాడి చేశారని వివరించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన అనితకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం తిరిగి అట్రాసిటీ కేసులు పెట్టించి దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. అటవీ అధికారులను కోర్టులు రక్షించకుంటే ఉల్లంఘనలు పెరుగుతాయని రావు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు సంబంధించిన మీడియా కథనాలను తన పిటిషన్‌కు జతచేశారు.
ఏడీఎన్ రావు పిటిషన్‌పై న్యాయస్థానం సత్వరమే స్పందించింది. సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ (సీఈసీ) కాకుండా స్వయంగా తామే పర్యవేక్షిస్తామని పేర్కొంది. ఇది పర్యావరణానికి సంబంధించిన అంశం కాదని, శాంతిభద్రతలకు సంబంధించిన అంశమని పేర్కొంది. శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అనితపై జరుగుతున్న అట్రాసిటీ కేసు దర్యాప్తుపై స్టే విధించింది.