Karnataka: నా పిల్లలపై ఒట్టు.. మా ఎమ్మెల్యే డబ్బు కోసమే బీజేపీకి అమ్ముడుపోయారు: జేడీఎస్ మంత్రి తీవ్ర ఆరోపణలు
- తనకు 28 కోట్ల అప్పు ఉందని నాతో చెప్పారు
- నెలకి కొంత సర్దుబాటు చేస్తానని చెప్పా
- ఆయన అసంతృప్తికి నేను కారణం కాదు
కర్ణాటక మంత్రి, జేడీఎస్ నేత సా.రా. మహేశ్ శాసనసభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బలపరీక్ష సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. తమ ఎమ్మెల్యే హెచ్. విశ్వనాథ్ డబ్బుల కోసం బీజేపీకి అమ్ముడుపోయారని, తన పిల్లలపై ఒట్టేసి మరీ ఈ విషయాన్ని చెబుతున్నట్టు పేర్కొన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది.
విశ్వనాథ్ గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారని, నాలుగు నెలల క్రితం తాను స్వయంగా వెళ్లి ఆయనను బుజ్జగించానని గుర్తు చేశారు. ఎన్నికల కోసం చేసిన అప్పు రూ.28 కోట్లు ఉందని, దానిని ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా ఆయన తనతో చెప్పారని పేర్కొన్నారు.
అయితే, అంతమొత్తాన్ని ఒకేసారి ఇవ్వడం తనకు కూడా సాధ్యం కాదని, కావాలంటే నెలకి కొంత చొప్పున సర్దుతానని భరోసా ఇచ్చానని మహేశ్ పేర్కొన్నారు. నెల తర్వాత కొంత మొత్తం ఇవ్వాలని భావించి ఫోన్ చేస్తే ఆయన ముంబైలో ఉన్నట్టు తెలిసిందన్నారు. ఆయన అసంతృప్తికి తానే కారణమన్న ఆరోపణలు సరికాదని, ఆయన వ్యాఖ్యల్లో నిజం లేదని తేల్చి చెప్పారు.
కాగా, తాను లేని సమయంలో తనపై ఆరోపణలు చేయడాన్ని ముంబై హోటల్లో ఉన్న విశ్వనాథ్ ఖండించారు. మంత్రిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కాగా, విశ్వనాథ్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి మహేశ్‌ను బీజేపీ డిమాండ్ చేసింది.