Current Bill: అధికారుల నిర్వాకం... నెల రోజుల కరెంట్ బిల్ రూ. 128,45,95,444 మాత్రమేనట!
- యూపీలో వ్యక్తికి 128 కోట్ల కరెంట్ బిల్
- కట్టాల్సిందేనని అధికారుల పట్టు
- తానెలా కట్టగలనని వాపోతున్న వ్యక్తి
ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ అధికారుల నిర్వాకం, ఓ వ్యక్తికి తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెట్టింది. నెల రోజుల విద్యుత్ బిల్లును రూ. 128 కోట్లుగా వేసిన అధికారులు, ఆ బిల్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలోని చామ్రి గ్రామంలో షామిమ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివశిస్తున్నాడు. అతనికి 2 కిలోవాట్ల లోడ్ తో కరెంట్ కనెక్షన్ ఉంది. గత నెల కరెంట్ బిల్ రూ. 128,45,95,444 వచ్చింది. దీంతో ఆయన విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించగా, వారు తామేమీ చేయలేమని చేతులెత్తేశారట.
"ఎన్నిసార్లు విన్నవించుకున్నా మా మాట ఎవరూ వినడం లేదు. ఇంత మొత్తాన్ని మేమెలా కట్టాలి? డబ్బు కడితే తప్ప కరెంట్ కనెక్షన్ ను కొనసాగించలేమని అధికారులు చెబుతున్నారు" అని షామీమ్ వాపోయారు. నెలకు రూ. 700 నుంచి రూ. 800 మధ్య బిల్లు తమకు వచ్చేదని, మొత్తం తమ ప్రాంతంలో కూడా నెలలో ఇంత బిల్లు రాదని అన్నాడు. ఉన్నతాధికారులను ఎవరిని సంప్రదించినా సాయం చేయడం లేదని, తన ఇంట్లో ఓ ఫ్యాన్, ఓ లైట్ మాత్రమే ఉన్నాయని, తమది చాలా పేద కుటుంబమని అన్నారు. తన జీవితాంతం సంపాదన కూడా అంత మొత్తం ఉండదని వాపోయాడు. కాగా, ఇది సాంకేతిక సమస్య కారణంగా వచ్చిన బిల్ అని, దీన్ని సరిచేస్తామని తనను సంప్రదించిన మీడియాకు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.