Kishan Reddy: నాకు అప్పగించిన కీలక బాధ్యతలు ఇవే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- జమ్ముకశ్మీర్ శాంతిభద్రతల బాధ్యతలను అప్పగించారు
- ఢిల్లీ పోలీస్, కేంద్రపాలిత ప్రాంతాల భద్రత బాధ్యత కూడా నాదే
- ఉగ్రవాదం, మావోయిజంపై ఉక్కుపాదం మోపుతాం
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సహాయమంత్రిగా పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జమ్ముకశ్మీర్ కు సంబంధించిన శాంతిభద్రతల బాధ్యతలను తనకు అప్పగించారని చెప్పారు. ఆ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను తీసుకొస్తానని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్ర కార్యకలాపాలను అరికడతామని చెప్పారు.
ఢిల్లీ పోలీస్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ తదితర కేంద్ర పాలిత ప్రాంతాల పర్యవేక్షణ, అంతర్గత భద్రత బాధ్యతలను కూడా తనపై ఉంచారని తెలిపారు. ఉగ్రవాదం, మావోయిస్టులు, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో రాజీపడబోమని చెప్పారు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి ఉరి శిక్ష విధించేలా ప్రధాని మోదీ కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నారని తెలిపారు.
హార్మోన్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చి పదేళ్ల అమ్మాయిలను 20 ఏళ్లవారిలా మార్చుతున్నారని... ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. బూత్ ల వారీగా బీజేపీ కమిటీలను నిర్మించుకోవాలని... రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.