Karnataka: కర్ణాటక నేతలకు రూ. 400 కోట్లు లంచమిచ్చా: ఐఎంఏ జ్యువెల్స్ యజమాని

  • ప్రజల నుంచి రూ. 4 వేల కోట్లు సేకరించిన మన్సూర్
  • వాటిని చెల్లించకుండా మోసం చేయడంతో అరెస్ట్
  • కన్నడనాట ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో ఆందోళన

కర్ణాటకలోని ప్రముఖ పొలిటికల్ లీడర్స్ కు, కొందరు ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు తాను రూ. 400 కోట్లను లంచంగా ఇచ్చానని ఐఎంఏ జ్యువెల్స్‌ సంస్థ యజమాని మహ్మద్‌ మన్సూర్‌ ఖాన్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ప్రజల నుంచి సుమారు రూ. 4 వేల కోట్లను డిపాజిట్లుగా సేకరించి, వాటిని తిరిగి చెల్లించకుండా మోసం చేశారని మన్సూర్ పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.

 దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ, అతన్ని అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ  విచారణలో మన్సూర్ పలు కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తుండటంతో, కన్నడనాట పలువురు నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ కేసులో ఎక్కడ తాము ఇరుక్కుపోతామా? అని పలువురు ఆందోళన చెందుతున్నట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఇదే కేసులో ఇప్పటికే ఓ ఐఏఎస్‌ అధికారిని ప్రత్యేక దర్యాఫ్తు బృందం అరెస్టు చేసింది. కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ ను తమ కార్యాలయానికి పిలిపించి విచారించారు. ఇదిలావుండగా, తనకు ఛాతీలో నొప్పిగా ఉందని విచారణ సందర్భంగా మన్సూర్‌ ఖాన్‌ చెప్పడంతో నిన్న రాత్రి ఆయన్ను సర్‌ జయదేవ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News