KCR: స్వగ్రామంపై వరాలజల్లు కురిపించిన కేసీఆర్
- ప్రతి ఇంటికి రూ. 10 లక్షల సాయం అందేలా పథకాన్ని తీసుకొస్తాం
- గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తాం
- అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ లు ఇస్తాం
తన స్వగ్రామమైన సిద్ధిపేట రూరల్ మండలంలోని చింతమడకపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఈరోజు ఆయన తన సొంతూరిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి ఇంటికి రూ. 10 లక్షల చొప్పున సాయం అందేలా పథకాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. దీని కోసం రూ. 200 కోట్లు కేటాయిస్తానని తెలిపారు. చింతమడక హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని... గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. చింతమడక, మాసాపూర్, సీతారాంపూర్ గ్రామాల్లోని 2 వేల కుటుంబాలకు ఉచితంగా కంటి, వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామంలోని అభివృద్ది పనులు మూడు, నాలుగు నెలల్లో పూర్తికావాలని అధికారులను ఆదేశించారు.
చింతమడకకు 1500 నుంచి 2వేల వరకు ఇళ్లను మంజూరు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఆరు నెలల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి, అర్హులకు అందజేస్తామని తెలిపారు. కార్తీక మాసంలో గృహ ప్రవేశాలు ఉంటాయని చెప్పారు. తన స్వగ్రామానికి తాను ఎంత చేసినా తక్కువేనని అన్నారు. పర్యటన సందర్భంగా తన చిన్ననాటి మిత్రులను కేసీఆర్ పలుకరించారు.