Krishna District: కృష్ణా జిల్లా మొవ్వలో 28 మందిని కరిచిన పాములు!
- వర్షాకాలం కావడంతో బయటకు వచ్చిన పాములు
- నిన్న ఒక్కరోజే ఆరుగురికి పాము కాటు
- తీవ్ర ఆందోళనలో అవనిగడ్డ, మొవ్వ ప్రాంత వాసులు
వర్షాకాలం మొదలైన నేపథ్యంలో కృష్ణా జిల్లా పరీవాహక ప్రాంతాల్లో బయటకు వచ్చిన పాములు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. పాముల సంచారం గణనీయంగా పెరగడంతో, వాటి కాటు బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. వర్షాలు మొదలైన తరువాత అవనిగడ్డ ప్రాంతంలో దాదాపు 30 మందిని పాములు కాటు వేయగా, ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. ఇక మొవ్వ మండలంలో ఇటీవల 28 మంది పాముకాటుకు గురై, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందారు. వీరందరికీ పాము విషానికి విరుగుడు వాక్సిన్లు ఇచ్చామని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే ఆరుగురు ఆసుపత్రికి పాము కాటుతో వచ్చారని చెప్పారు. పాముల బెడద తమకు నిద్రలేకుండా చేస్తోందని ఈ ప్రాంత ప్రజలు వాపోతున్నారు.