West Indies: టీమిండియాతో తొలి రెండు టి20 మ్యాచ్ లకు వెస్టిండీస్ జట్టు ఎంపిక
- స్థానం దక్కించుకున్న పొలార్డ్, నరైన్మెరికా
- ఆగస్టు 3న టీమిండియా, విండీస్ తొలి టి20 మ్యాచ్
- ఆతిథ్యమిస్తోన్న అమెరికా
త్వరలో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భారత్ ముందుగా మూడు టి20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ నేపథ్యంలో, తొలి రెండు టి20 మ్యాచ్ ల్లో ఆడే వెస్టిండీస్ జట్టును ప్రకటించారు. సీనియర్ ప్లేయర్లు కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్ కూడా జట్టులో స్థానం సంపాదించుకున్నారు. కొత్తగా వికెట్ కీపర్ ఆంథోనీ బ్రాంబుల్ జట్టుకు ఎంపికయ్యాడు.
విండీస్ టి20 జట్టుకు కెప్టెన్ గా కార్లోస్ బ్రాత్ వైట్ ను నియమించారు. విధ్వంసక బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ పేరు చర్చకు వచ్చినా, ప్రస్తుతం అతడు కెనడాలో జీటీ20 టోర్నీలో ఆడుతుండడంతో ఎంపిక చేయలేదు. దాంతో, కొత్తగా మరో ఎడమచేతివాటం ఓపెనర్ జాన్ క్యాంప్ బెల్ కు విండీస్ సెలెక్టర్లు అవకాశమిచ్చారు.
కాగా, ఆగస్టు 3న భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరగనుంది. టి20 సిరీస్ లోని తొలి రెండు మ్యాచ్ లు అమెరికాలో జరగనున్నాయి. ఫ్లోరిడాలోని లాడర్ హిల్ మైదానం ఈ మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వనుంది.
విండీస్ టీమ్
కార్లోస్ బ్రాత్ వైట్ (కెప్టెన్), ఎవిన్ లూయిస్, సునీల్ నరైన్, కీమో పాల్, ఖారీ పియరీ, కీరన్ పొలార్డ్, నికోలాస్ పూరన్, షిమ్రోన్ హెట్మెయర్, రోవ్ మాన్ పావెల్, ఆండ్రే రస్సెల్, ఒషానే థామస్, ఆంథోనీ బ్రాంబుల్, జాన్ క్యాంప్ బెల్, షెల్డన్ కాట్రెల్.