Nizamabad District: కారులో చిన్నారుల మృతదేహాలు...మృతిపై అనుమానాలు

  • ఊపిరాడక చనిపోయారా?...మరో కారణమా?
  • కారు యజమాని గుర్తించి పోలీసులకు సమాచారం
  • నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఘటన

ఓ కారు యజమాని అర్ధరాత్రి దాటాక తన కారు వెనుక డోరు తెరిచి షాకయ్యారు. ఇద్దరు చిన్నారుల మృతదేహాలు కనిపించడంతో కంగారుపడిన అతను పోలీసులకు సమాచారం అందించాడు. వీరు ఎలా చనిపోయారన్న దానిపై ప్రస్తుతం పోలీసులు కూపీ లాగుతున్నారు.

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. ముజాహిద్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ రియాజ్‌ (10), మహ్మద్‌ బద్రుద్దీన్‌ (5)లు అక్కాచెల్లెళ్ల కుమారులు. మంగళవారం సాయంత్రం ఆడుకునేందుకు వెళ్లిన వీరు రాత్రయినా ఇంటికి చేరలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలావుండగా, బాధిత కుటుంబాల ఇళ్లకు సమీపంలో ఉంటున్న కారు యజమాని మంగళవారం రాత్రి 2.30 గంటల సమయంలో కారు డోరు తెరిచాడు. వెనుక సీట్లో ఇద్దరు పిల్లలు చనిపోయి పడివుండడంతో షాకయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

అయితే చిన్నారుల మృతిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారులు కారులోకి ప్రవేశించాక డోర్‌ వేసుకోవడంతో ఊపిరాడక చనిపోయారా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న అనుమానాలను చిన్నారుల కుటుంబ సభ్యులు, బంధువులు వ్యక్తం చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News