Andhra Pradesh: బీజేపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి!
- ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యుల జంప్
- తాజాగా మరో నేత కమలం పార్టీలోకి
- 2024కల్లా ఏపీలోనే పెద్దపార్టీగా అవతరిస్తామని ధీమా
ఆంధ్రప్రదేశ్ లో మరో నేత టీడీపీని వీడారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులైన సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్ లు పార్టీని వీడగా, తాజాగా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పి.గన్నవరంలో ఈరోజు జరిగిన బహిరంగ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా పులపర్తి నారాయణమూర్తికి పార్టీ కండువా కప్పిన రామ్ మాధవ్ ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం రామ్ మాధవ్ మాట్లాడుతూ.. ఏపీలో ఇప్పటివరకూ ప్రాంతీయ పార్టీలే రాజ్యమేలాయని తెలిపారు. 2024 నాటికి ఏపీలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు మోదీ ఏకైక ప్రతినిధి అని వ్యాఖ్యానించారు.