Telangana: సర్పంచ్ లను అరెస్టు చేయడంపై తెలంగాణ బీజేపీ ఎంపీల మండిపాటు
- నిన్న జగిత్యాలలో సర్పంచ్ ల అరెస్టుపై ఖండన
- చెక్ పవర్ ను ఉపసర్పంచ్ కు ఎలా ఇస్తారు?
- కేసీఆర్ అనవసర నిర్ణయాలు తీసుకుంటున్నారు
నిన్న జగిత్యాలలో సర్పంచ్ లను అరెస్టు చేసిన ఘటనపై బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఖండించారు. ఈ వ్యవహారంపై ఢిల్లీలో ఈరోజు మీడియాతో మాట్లాడారు. సర్పంచ్ లను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమేనని, సర్పంచ్, కార్యదర్శులకు ఉన్న చెక్ పవర్ ను ఉపసర్పంచ్ కు ఎలా ఇస్తారని ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. అవగాహన లేకనే సీఎం కేసీఆర్ ఇలాంటి అనవసర నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
బండి సంజయ్ మాట్లాడుతూ, సర్పంచ్ ల అరెస్టును ఖండిస్తున్నామని అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ తన ప్రవర్తన మార్చుకోవాలని, ప్రభుత్వ అధికారి అయివుండి, అధికార పార్టీకి కొమ్ముకాయడం తగదని సూచించారు. స్వచ్ఛభారత్ కింద నిర్మించే మరుగుదొడ్ల నిర్మాణం, ఎల్ఈడీ బల్బుల పంపిణీకి సంబంధించి అవినీతి జరిగిందని, దీనిపై తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.