Andhra Pradesh: ఏపీకి పరిశ్రమలు రావంటూ అపోహలు సృష్టిస్తున్నారు: సీఎం వైఎస్ జగన్
- స్థానికులకు ఉద్యోగాలపై రకరకాల ప్రచారం తగదు
- ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్
- ఏపీలో లంచాలు ఉండవని ప్రతి పారిశ్రామికవేత్తకు హామీ ఇస్తున్నా
కొత్త చట్టం వల్ల ఏపీకి పరిశ్రమలు రావంటూ అపోహలు సృష్టిస్తున్నారని, వాటిని నమ్మొద్దని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానికులకు ఉద్యోగాలపై రకరకాల ప్రచారం చేస్తున్నారని, పరిశ్రమలు రావని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేటప్పుడే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకముంటేనే, పరిశ్రమలకు స్థానికులు సహకరిస్తారని, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకో లేదా దేశాలకో వెళ్లే పరిస్థితి ఉందని అన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, పరిశ్రమల్లో ఉద్యోగులకు ఉండాల్సిన నైపుణ్యం కోసం శిక్షణను ఈ సెంటర్ల ద్వారా అందజేస్తామని అన్నారు.
స్థానికులకు వెంటనే ఉద్యోగాలు కల్పించలేకపోతే, మూడేళ్ల కాలపరిమితిలో కల్పించేలా వెసులుబాటు కల్పించామని అన్నారు. విద్యుత్ ఒప్పందాల సమీక్షపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వమే అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే, పరిశ్రమలకు అంతకంటే ఎక్కువ ధరలకు కరెంట్ ఇవ్వాల్సి ఉంటుందని, అందువల్ల పరిశ్రమలకు కూడా ఇబ్బంది ఉంటుందని అన్నారు. ఏపీలో లంచాలు ఉండవని ప్రతి పారిశ్రామికవేత్తకు హామీ ఇస్తున్నానని అన్నారు.