Jammu And Kashmir: ఆ మాట నిజమో, అబద్ధమో.. వివరణ ఇవ్వాలి: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి
- జమ్ముకశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలని మోదీ కోరారన్న ట్రంప్
- పార్లమెంట్ లో ప్రతిపక్షాల రెండోరోజూ నిరసన
- ప్రధాని వివరణ ఇవ్వాలని పట్టుబట్టిన ప్రతిపక్షాలు
జమ్ముకశ్మీర్ అంశంపై జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీ తనను కోరారన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో ప్రతిపక్షాలు రెండోరోజూ నిరసనకు దిగాయి. ట్రంప్ ప్రకటనపై ప్రధాని వివరణ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ సభ్యుడు శశిథరూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు.
ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే ప్రధాని వివరణ కోరుతూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. వివరణ ఇచ్చి తీరాల్సిందేనని కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని ప్రధాని మోదీ కోరినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారని, ఆ మాట నిజమో, అబద్ధమో కానీ, దీనిపై వాళ్లిద్దరూ వివరణ ఇవ్వలేదని అధిర్ రంజన్ చౌదరి అన్నారు. అందుకే, ఈ విషయమై అనుమానాలు రేకెత్తుతున్నాయని అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఓ ప్రకటన చేశారు. అయితే, ప్రధానికి బదులు రక్షణశాఖ మంత్రి వివరణ ఇవ్వడంపై మండిపడ్డ ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.