Gummanuru Jayaram: బ్రహ్మ, వాల్మీకి, అల్లా, ఏసు... పేరేదైనా అంతా జగనే: ఏపీ మంత్రి జయరాం
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట
- స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు
- బిల్లుపై మాట్లాడుతూ జయరాం పొగడ్తలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండ, దండ జగనేనని, జగన్ దేవుడి వంటి వాడని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న బిల్లుపై అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, తాను వాల్మీకి బోయ కుటుంబానికి చెందిన వాడినని, తనకు జగనన్న వాల్మీకేనని అన్నారు. అందరికీ బ్రహ్మ తలరాత రాశాడని చెబుతుంటారని, తనకు మాత్రం జగన్ రాసిన రాతతోనే మంత్రి పదవి దక్కిందని అన్నారు. తాను పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకున్నారని కొనియాడారు.
నామినేటెడ్ పదవులు, పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన జగన్, ఎస్సీలకు అంబేద్కర్ గా, ముస్లింలకు అల్లాగా, క్రిస్టియన్లకు జీసస్ గా కనిపిస్తున్నారని పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబుకు, జగన్ కు నక్కకూ, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. గతంలో ప్రజలను, ప్రజా ప్రతినిధులను చంద్రబాబు వంచించారని, ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసి, ఆపై వారిని మరచిపోయారని విమర్శలు గుప్పించారు. కాగా, మంత్రి జయరాం మాట్లాడుతుండగా, జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు నవ్వులు చిందిస్తూ ఉండటం గమనార్హం. ఆ సమయంలో టీడీపీ సభ్యులు మాత్రం సభలో లేరు.