Biggboss: యాంకర్ శ్వేతారెడ్డి ఆరోపణల కేసు.. 'బిగ్ బాస్' నిందితులకు ముందస్తు బెయిల్!
- శ్వేతారెడ్డి ఫిర్యాదుతో నలుగురిపై కేసు
- నిన్న ముందస్తు బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు
- స్టార్ మా చానల్ అడ్మిన్ హెడ్ కు నోటీసులు
టాలీవుడ్ 'బిగ్ బాస్' ఓ బ్రోతల్ హౌస్ లా మారిందని, కార్యక్రమం నిర్వాహకులు కాస్టింగ్ కౌచ్ ని ప్రోత్సహిస్తున్నారని యాంకర్ శ్వేతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో నిందితులుగా పేర్కొన్న నలుగురికి ముందస్తు బెయిల్ లభించింది. బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసును నమోదు చేయగా, బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఇన్ ఛార్జి శ్యామ్ తోపాటు మరో ముగ్గురిపై కేసు రిజిస్టర్ అయిన సంగతి తెలిసిందే.
ఈ నెల 13న శ్వేతారెడ్డి ఫిర్యాదు ఇవ్వగా, శ్యామ్, రవికాంత్, రఘు, శశికాంత్ లపై పోలీసులు కేసులు పెట్టారు. నాటి నుంచి పోలీసుల విచారణకు హాజరుకాని వారు, బుధవారం నాడు నాంపల్లి కోర్టుకు హాజరై, ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లను దాఖలు చేశారు. తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, పోలీసుల విచారణకు సహకరిస్తామని చెప్పారు. దీంతో వారికి ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో స్టార్ మా చానెల్ అడ్మిన్ హెడ్ కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.