Yedeyurappa: మోదీ-షా కొత్త ఆలోచన.. కర్ణాటక సీఎంగా అనంతకుమార్ హెగ్డే?
- గంట గంటకూ మారుతున్న కర్ణాటక రాజకీయం
- యడ్యూరప్పను వద్దంటున్న ఆర్ఎస్ఎస్
- ఆర్ఎస్ఎస్ నేతలతో యడ్డీ మంతనాలు
కర్ణాటక రాజకీయాలు గంటగంటకూ మారుతున్నాయి. యడ్యూరప్ప సీఎం కావాలని ఎక్కువ మంది బీజేపీ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నప్పటికీ, ఆర్ఎస్ఎస్ మాత్రం ససేమిరా అంటుండటంతో బీజేపీ అధిష్ఠానం కొత్త పేర్లను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత, ప్రస్తుతం ఎంపీగా ఉన్న అనంతకుమార్ హెగ్డే పేరును అమిత్ షా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు శ్రీరాములు, ఉదాసి, అశోక్ లలో ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని కూడా బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.
యడ్యూరప్పకు సీఎం పదవి ఇవ్వకుంటే అసంతృప్తులు పెరగవచ్చని అంచనా వేస్తున్న మోదీ-షా ద్వయం అందువల్లే ఇంకా సస్పెన్స్ ను కొనసాగిస్తున్నట్టు బీజేపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే రాజీనామాలు చేసిన కాంగ్రెస్ - జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చాకనే ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందడుగు వేయాలన్నది తమ అభిమతమని చెబుతున్నారు.
ఇదిలావుండగా, బెంగళూరు చామరాజపేటలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయ భవనమైన 'కేశవశిల్ప'కు వచ్చిన యడ్యూరప్ప, అక్కడి ప్రముఖులతో దాదాపు గంటపాటు మంతనాలు జరిపారు. ఆర్ఎస్ఎస్ పెద్దల ఆశీర్వాదం కోసమే తాను వచ్చానని, ఇంతకాలం తాను ఆర్ఎస్ఎస్ నీడలోనే ఎదిగానని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.