Libya: వలసదారులతో వెళుతున్న పడవ బోల్తా.. 150 మంది మృతి
- లిబియాలో కొనసాగుతున్న వలసలు
- ప్రజల ప్రాణాలు హరిస్తున్న అంతర్గత పోరు
- పడవ ప్రయాణాల్లో ఇప్పటి వరకు 2,297 మంది మృతి
లిబియాలో కొనసాగుతున్న అంతర్గత పోరు, అల్లర్లు ఆ దేశ ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. దేశంలో ఉండలేక బతుకు దెరువు కోసం వలసబాట పట్టిన లిబియా వాసుల పడవ ప్రయాణం మరోమారు విషాదాంతమైంది. పొట్టచేత పట్టుకుని వలసబాట పడుతున్న లిబియన్లు అకారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నా ప్రయాణాలు మాత్రం మానడం లేదు.
తాజాగా లిబియా నుంచి యూరప్‌కు 250 మందితో వెళ్తున్న పడవ మధ్యదరా సముద్రంలో ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఈ ఘటనలో 150 మంది మరణించారని, 145 మందిని రక్షించామని అంతర్జాతీయ వలసదారుల సంస్థ తెలిపింది. కాగా, లిబియాలో ఇప్పటి వరకు జరిగిన పడవ ప్రయాణాల్లో 2,297 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. తాజా ఘటనపై విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐరాస కమిషనర్ ఫిలిప్పో గ్రాండీ ట్వీట్ చేశారు.