railway: ఎయిర్ హోస్టెస్‌ల మాదిరి.. ఇకపై రైల్ హోస్టెస్‌లు!
- విమానాల్లో మాదిరి ప్రయాణికులకు సేవలు
- ప్రస్తుతం గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌లో...
- త్వరలో రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియర్ రైళ్లలో అమలు
ఆతిథ్య రంగానికి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ కూడా అటు వైపుగా అడుగులు వేస్తోంది. విమానాల్లో ప్రయాణికులకు సాదర స్వాగతం పలికి ఆకట్టుకునే ఎయిర్ హోస్టెస్‌ల మాదిరి రైళ్లలోనూ ’రైల్ హోస్టెస్’ను నియమిస్తుంది. రైలు ఎక్కినప్పటి నుంచి వారు గమ్యానికి చేరే వరకు వీరందించే చక్కని ఆతిథ్యం వల్ల ప్రయాణం సంతృప్తికరంగా ముగిసిందన్న ఆనందం ప్రయాణికులకు మిగులుతుందన్నది రైల్వే శాఖ ఉద్దేశం. ఇప్పటికే గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌లో అమలవుతున్న ఈ సేవలను త్వరలో రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియర్ రైళ్లలోనూ ప్రవేశపెట్టే యోచన చేస్తున్నారు. రైల్ హోస్టెస్లతోపాటు మేల్ స్టివార్డులు కూడా ప్రయాణికులకు సేవలందించనున్నారు.
ఇందుకోసం రైల్వేస్టేషన్లలో ఆహార కేంద్రాలు, ప్యాంట్రీలకు చెందిన రెండు వేల మంది సిబ్బందికి శిక్షణ అందజేస్తారు. తర్వాత దశలో ఫ్లాట్‌ఫారాలపై అధికారికంగా పదార్థాలు విక్రయించే వారికి కూడా ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. శిక్షణలో భాగంగా వీరికి ప్రయాణికులతో వ్యవహరించే విధానం, వస్త్రధారణపై కేంద్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ ఇస్తుంది.
సంతృప్తికరంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారిని విధుల్లో నియమిస్తారు. దుస్తులపై యాప్రాన్లు వేసుకుని, చేతికి తొడుగులు (గ్లవ్స్), తలపై టోపీలు పెట్టుకుని ప్రత్యేక అలంకరణతో కనిపించే వీరు ప్రయాణికులకు వార్తా పత్రికలు, మేగజైన్లు, ఆహారం వంటివి సరఫరా చేస్తారు.