Karnataka: కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప
- రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం
- యడ్డీతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్
- హాజరైన బీజేపీ నేతలు, ప్రభుత్వ అధికారులు
కర్ణాటక సీఎంగా బీజేపీ నేత యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ వాజుభాయ్ వాలా, యడ్యూరప్పతో ప్రమాణస్వీకారం చేయించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సీఎంకు పుష్పగుచ్ఛం ఇచ్చిన గవర్నర్ ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం యడ్యూరప్ప మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. సభలో బలనిరూపణ అనంతరం మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు, పలువురు ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.
కాగా, కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప బాధ్యతలు స్వీకరించడం ఇది నాల్గోసారి. తొలిసారిగా 2007, నవంబరులో సీఎంగా చేశారు. అయితే, మద్దతుగా నిలుస్తామన్న జేడీఎస్ మాటమార్చడంతో కేవలం నాలుగు రోజులకే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో రెండోసారి యడ్యూరప్ప సీఎం అయ్యారు. అయితే, ఆయనపై అవినీతి ఆరోపణలు తలెత్తడంతో 2011లో తన పదవికి రాజీనామా చేశారు. తనను పదవి నుంచి తొలగించిన బీజేపీపై అలిగిన యడ్యూరప్ప, 2012లో ఆ పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ స్థాపించారు. అయితే, ఆ పార్టీకి ప్రజాదరణ లేకపోవడంతో 2014లో బీజేపీలో తన పార్టీని విలీనం చేశారు. అదే ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శివోగా నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
2018 మే లో ఆయన మూడోసారి సీఎం అయ్యారు. అయితే, మెజార్టీకి అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో కేవలం రెండు రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు.