cat: అదృశ్యమైన పిల్లి.. బంజారాహిల్స్ పోలీసులకు మహిళ ఫిర్యాదు!

  • ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తికి పిల్లి దత్తత
  • వ్యాక్సిన్ కోసం తీసుకురమ్మంటే పారిపోయిందని సమాధానం
  • జీవహింస చట్టం కింద చర్యలు తీసుకోవాలని పిర్యాదు

తాను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లి అదృశ్యమైందని, దానిని వెతికి పట్టుకోవాలంటూ ఓ మహిళ హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు, దానిని తెచ్చిచ్చిన వారికి పదివేల రూపాయల బహుమతి కూడా ఇస్తానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుమలగిరిలో నివాసముండే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాజేశ్వరి తన ఇంట్లో రకరకాల పెంపుడు జంతువులు, పక్షులను పెంచుకుంటోంది. అందులో బ్లెస్సీ అనే పిల్లి కూడా ఉంది.

ఈ నెల 13న ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన బంజారాహిల్స్‌ రోడ్ నంబరు 3లోని శ్రీనికేతన్‌కాలనీకి చెందిన ఓ వ్యక్తికి బ్లెస్సీని దత్తత ఇచ్చింది. ఈ నెల 20న పిల్లికి వ్యాక్సిన్ వేయించాల్సి ఉండడంతో అతడికి ఫోన్ చేసి బ్లెస్సీని తీసుకురావాల్సిందిగా కోరింది. అయితే, అతడి నుంచి సరైన సమాధానం రాలేదు. మూడు రోజులపాటు అతడి ఇంటి చుట్టూ తిరిగినా బ్లెస్సీని ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చింది. పిల్లి గురించి గట్టిగా నిలదీస్తే అది పారిపోయిందని సమాధానం చెప్పాడు.

అతడి సమాధానంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజేశ్వరి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. దత్తత తీసుకున్న వ్యక్తి నిర్లక్ష్యం కారణంగానే బ్లెస్సీ పారిపోయిందని, జీవహింస చట్టం కింద అతడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. తొలుత ఆశ్చర్యపోయిన పోలీసులు ఆ తర్వాత తేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దత్తత తీసుకున్న వ్యక్తి ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. ఏడాదిన్నర వయసున్న తన పిల్లిని అప్పగిస్తే రూ. 10 వేల నగదు బహుమతి కూడా ఇస్తానని రాజేశ్వరి తన ఫేస్‌బుక్ ఖాతాలో ప్రకటించింది.

  • Loading...

More Telugu News