Narendra Modi: అమరవీరుల స్మారకాలు పుణ్యక్షేత్రాల కంటే పవిత్రమైనవి: ప్రధాని మోదీ
- కార్గిల్ డే నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు
- దేశం కోసం ప్రాణాలు అర్పించడమే అమరత్వం అని పేర్కొన్న మోదీ
- కార్గిల్ విజయం మన సైన్యం సత్తాకు ప్రతీక అంటూ కితాబు
కార్గిల్ డే నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అమరవీరులను వేనోళ్ల కీర్తించారు. కార్గిల్ లో పోరాడిన సైనికులు నిజమైన యుద్ధవీరులని కొనియాడారు. కార్గిల్ యుద్ధవీరులకు ప్రణామాలు అర్పిస్తున్నానని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించడమే అమరత్వం అని పేర్కొన్న మోదీ, అందుకే అమరవీరుల స్మారకాలు పుణ్యక్షేత్రాల కంటే పవిత్రమైనవని భాష్యం చెప్పారు.
కార్గిల్ విజయం భారత్ సత్తాకు ప్రతీక అని, మన సైనికుల కర్తవ్యదీక్షకు సూచిక అని అభివర్ణించారు. కార్గిల్ యుద్ధం తర్వాత మన సైన్యం మంచుకొండల్లో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారని కితాబిచ్చారు. దేశ భవిష్యత్తును కాపాడే నిజమైన వీరులు సైనికులేనని, సైనికుల వెనుక దేశప్రజలంతా ఉన్నారని ఉద్ఘాటించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించేవారిని ఈ దేశం సదా స్మరించుకుంటుందని తెలిపారు.