Vizag: విశాఖ గోషా ఆసుపత్రిలో చంద్రబాబు, కామినేని ఫొటోలు చూసి మండిపడిన అవంతి శ్రీనివాస్
- దగ్గరుండి ఫొటోలు తీసేయించిన అవంతి
- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవంటూ సిబ్బందికి హెచ్చరిక
- గర్భిణీలకు అందించే ఆహారం తిన్న మంత్రి
- మాడిపోయిన పప్పుతో భోజనం పెట్టారంటూ అసహనం
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇవాళ విశాఖపట్నంలోని గోషా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో ప్రవేశించిన ఆయనకు చంద్రబాబు, కామినేని శ్రీనివాస్ ల ఫొటోలు స్వాగతం పలికాయి. దాంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారి రెండు నెలలు గడుస్తున్నా, ఇంకా సీఎంగా చంద్రబాబు, ఆరోగ్యశాఖ మంత్రిగా కామినేని శ్రీనివాస్ ల ఫొటోలు ఉండడమేంటి? అంటూ ఆసుపత్రి సిబ్బందిపై మండిపడ్డారు. అంతేకాదు, తాను దగ్గరుండి మరీ ఆ ఫొటోలు తీయించేశారు. ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.
ఇక, వార్డుల పర్యవేక్షణకు వెళ్లిన ఆయన అక్కడ గర్భిణీ స్త్రీలకు అందించే ఆహారాన్ని భుజించారు. ఇక్కడ కూడా మంత్రికి అసంతృప్తి తప్పలేదు. మాడిపోయిన పప్పుతో భోజనం పెట్టారంటూ అసహనం వ్యక్తం చేశారు. గర్భిణీలకు మంచి పోషకాహారం అందించాల్సి ఉండగా, ఇలాంటి భోజనం పెడతారా? అంటూ సిబ్బందిని ప్రశ్నించారు.