Andhra Pradesh: టాలీవుడ్ పెద్దలు కనీసం జగన్ ను అభినందించలేదు.. అదే చంద్రబాబు గెలిచి ఉంటేనా!: ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ
- వైసీపీ వాళ్లను సినిమాల నుంచి తీసేయాలన్నారు
- జగన్ సీఎం కావడం టాలీవుడ్ పెద్దలకు ఇష్టం లేదు
- అమరావతిలో మరో 30 ఏళ్లు వైసీపీ జెండానే
కార్యకర్తలతో కలిసి నడిచేవాడు, వాళ్ల కష్టాలను తెలుసుకునేవాడే నాయకుడనీ, లీడర్ అని వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ తెలిపారు. కానీ కొందరు నేతలు మాత్రం సంక్రాంతికి హరిదాసులు వచ్చినట్లు ఎన్నికలకు ముందు వచ్చి ఆ తర్వాత మాయమైపోతుంటారని వ్యాఖ్యానించారు. వైసీపీకి సపోర్టు చేసిన వాళ్లను సినిమాల నుంచి తీసేయండి, పక్కన పెట్టండి అని కొందరు ఆదేశించారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు వేషాలు ఇస్తారని తాను ట్రంకు పెట్టె పట్టుకుని తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్ కు రాలేదని స్పష్టం చేశారు.
తాను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ ఎకనమిక్స్ చేశానని చెప్పారు. రంజీ క్రికెట్ ప్రాపబుల్స్ లో తన పేరు ఉందన్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం, శ్రీఆంజనేయం, ఆ తర్వాత లౌక్యం సినిమాలతోనే తనకు మంచి బ్రేక్ వచ్చిందని పృథ్వీ తెలిపారు. జగన్ సీఎం కావడం టాలీవుడ్ పెద్దలకు ఇష్టం లేదని ఆయన ఆరోపించారు.
కనీసం జగన్ కు శుభాకాంక్షలు చెప్పడం కూడా వీళ్లకు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి ఉంటే వీరంతా బొకేలతో సాయంత్రానికే ప్రత్యేక విమానాల్లో దిగిపోయేవారని ఎద్దేవా చేశారు. అమరావతిపై వైసీపీ జెండా రాబోయే 30 ఏళ్ల పాటు ఎగురుతూనే ఉంటుందని పృథ్వీ జోస్యం చెప్పారు.