Telugudesam: కాపులకు జగన్ చేస్తున్న అన్యాయంపై పోరాటం చేస్తా: జ్యోతుల నెహ్రూ
- కాపులకు రిజర్వేషన్ అమలు చేయలేమని చెప్పడం ఆశనిపాతం
- అమ్మఒడి పథకంపై మడమ తిప్పారు
- కేసీఆర్ రుణం తీర్చుకోవాలని జగన్ చూస్తున్నారు
కాపులను ఆదుకోవాలని కార్పొరేషన్ ఏర్పాటు చేశారని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసి కాపుల రిజర్వేషన్ కోసం కృషి చేశారని, కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ లో కాపులకు 5 శాతం ఇచ్చారని, కేంద్రం సహకరించకపోవడంతో చట్టం చేయలేకపోయామని అన్నారు.
రిజర్వేషన్ అమలు చేయలేమని జగన్ చెప్పడం కాపుల విషయంలో ఆశనిపాతం, కేంద్రం ఇచ్చిన హామీతో కలిపి రైతు భరోసా అమలు చేస్తామంటున్నారని, అమ్మఒడి పథకంపై మడమ తిప్పారని విమర్శించారు. గోదావరి జలాల విషయమై అసెంబ్లీలో జగన్ సత్యదూరమైన మాటలు చెబుతున్నారని, కేసీఆర్ రుణం తీర్చుకోవాలని జగన్ చూస్తున్నారని ధ్వజమెత్తారు. కాపులకు జగన్ చేస్తున్న అన్యాయంపై పోరాటం చేస్తామని, కాపుల వల్లే అధికారంలోకి వచ్చిన విషయం మర్చిపోవద్దని, టీడీపీ అసెంబ్లీలో చేసిన తీర్మానంపై కేంద్రం చట్టం చేసేలా చూడాలని సూచించారు.