krishna river: కృష్ణమ్మలో వరద ప్రవాహం... జూరాల ప్రాజెక్టు వైపు పరుగులు
- కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు
- ఇప్పటికే నిండుకుండను తలపిస్తున్న నారాయణపూర్
- లక్షా 2 వేల 420 క్యూసెక్కులు దిగువకు విడుదల
తన పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో కృష్ణా నది జల ప్రవాహంతో కళకళలాడుతోంది. నైరుతి రుతుపవనాలు దేశ్యాప్తంగా విస్తరించి గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటక, మహారాష్ట్రల్లో కురిసిన వర్షాల ప్రభావం కృష్ణా నదిలో కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుంటుండడంతో అధికారులు దిగువకు నీరు వదిలి పెడుతున్నారు.
ఎడతెరిపిలేని వర్షాలు, పైనుంచి తరలివస్తున్న వరద కారణంగా అధికారులు నారాయణపూర్ డ్యాంకు చెందిన 18 గేట్లను ముందుగానే ఎత్తివేసి లక్షా 2 వేల 420 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. ఈ రోజు అర్ధరాత్రికి ఈ వరద మహబూబ్నగర్ జిల్లాలోని కువపూర్ వద్ద ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు చేరుకునే అవకాశం ఉంది.
కృష్ణమ్మ తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత ఆ నదిపై ఉన్న తొలి ప్రాజెక్టు ఇది. దీని నీటి నిల్వ సామర్థ్యం 9.68 టీఎంసీలు. వర్షాలు మరికొన్నాళ్లు ఇలాగే కురుస్తూ, వరద ప్రవాహం కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో జల కళ కనిపిస్తుంది.