Medak District: జాతి వైరం మరిచి...మూగజీవాల అనుబంధం

  • కుక్క పిల్లలను సాకుతున్న కోడి
  • ఏమీ అనకుండా చూస్తున్న తల్లి కుక్క
  • ఆచ్చెరువొందుతున్నచూపరులు

కుల, మత, జాతి, ప్రాంతీయ విద్వేషాలు మనుషుల మధ్యే తప్ప మూగజీవాల మధ్య ఉండవని నిరూపించే సంఘటన ఇది. సాధారణంగా కోడి కనిపిస్తే కుక్కవెంటపడి దాన్ని చంపి తినేయాలని ఆశపడుతుంది. కానీ మెదక్‌ జిల్లా హత్నూర మండలం నాగారం గ్రామంలోని ఓ కోడి, కుక్క మాత్రం తమ జాతి లక్షణాలకు భిన్నంగా ప్రవర్తిస్తూ పెంపకం దారుడినే కాదు, చూపరులను కూడా అచ్చెరువొందిస్తున్నాయి.

ఆ వివరాల్లోకి వెళితే, నాగారం ఎంపీటీసీ మాజీ సభ్యుడు మస్కూరి ఆగమయ్య తన వ్యవసాయ క్షేత్రంలో ఓ కుక్కను, కోడిని పెంచుతున్నారు. కోడి దాదాపు 20 గుడ్లుపెట్టినా ఆగమయ్య కుటుంబం వాటిని ఎప్పటికప్పుడు వాడేసేవారు. దీంతో కోడి  పొదిగేందుకు గుడ్లు లేకుండా పోయాయి.

కాగా, ఆగమయ్య పెంచిన కుక్క ఇటీవల కోడి నివసించే గూడులోకి వెళ్లి ఐదు పిల్లలను ఈనింది. అప్పటి నుంచి కోడి కూడా కుక్కపిల్లల్ని తన పిల్లల్లా సాకుతోంది. కుక్క తన పిల్లలకు పాలు ఇస్తున్నంతసేపు కోడి అక్కడే కాపలాగా ఉంటుంది. ఆ సమయంలో తల్లి కుక్క ఏమీ అనదు.

తల్లి కుక్క వెళ్లిపోగానే కుక్క పిల్లల సంరక్షణ బాధ్యత కోడి తీసుకుంటుంది. తన రెక్కల కింద పొదుగుతున్నట్టుగా పిల్లల్ని కప్పేసి కూర్చుంటోంది. పిల్లల దగ్గరికి ఎవరు వచ్చినా తల్లి కుక్కలాగే కోడి కూడా వెంబడిస్తోంది. వీటి అన్యోన్యత చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.

  • Loading...

More Telugu News