Odisha Rasagola: ఒడిశా రసగుల్లాలకు ప్రత్యేక గౌరవం.. జీఐ ట్యాగ్ జారీ!
- దరఖాస్తు చేసిన ఒడిశా సర్కారు
- ఆమోదం తెలిపిన జీఐ రిజిస్ట్రార్
- ఉత్పత్తులకు లభించనున్న రక్షణ
ఒడిశా రాష్ట్రంలో తయారయ్యే రసగుల్లాలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఈ రాష్ట్రంలో తయారయ్యే రసగుల్లాలకు భౌగోళిక గుర్తింపు(జియోగ్రాఫికల్ ఇండికేషన్-జీఐ) ట్యాగ్ ను జారీచేస్తూ భారత జీఐ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీచేశారు. ఒడిశా చిన్నతరహా పరిశ్రమల కార్పొరేషన్ తో పాటు, రసగుల్లాల తయారీదారులు ఇందుకోసం దరఖాస్తు చేశారు. దీంతో ఈ దరఖాస్తు ను పరిశీలించిన జీఐ రిజిస్ట్రార్ ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రక్షణ) చట్టం-1999 కింద ఆమోదం తెలిపారు.
ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగా ఒక నాణ్యత ఉంటుంది. అదే వాటి ప్రత్యేకత. ఆ విశిష్టతను దృష్టిలో ఉంచుకుని జీఐ ట్యాగ్ జారీచేస్తారు. దీనివల్ల ఆయా వస్తువులు, పంటలు, లేదా కళల పేరుతో మరొకరు, మరో ప్రాంతంలో వాటిని రూపొందించి విక్రయించడం చట్టరీత్యా చెల్లదు. అసలు హక్కుదారులకు ఇది రక్షణ.
రుణాలు, అమ్మకాలకు ఇది ఒక సర్టిఫికెట్ లాంటిది. బాస్మతి బియ్యం, డార్జిలింగ్ టీపొడీ,పోచంపల్లి చీరలు, బొబ్బిలి వీణ, గద్వాల్ చీర, కొండపల్లి, నిర్మల్ బొమ్మలు, తిరుపతి లడ్డూ, బంగినపల్లి మామిడిపళ్లు సహా పలు ఉత్పత్తులకు ప్రస్తుతం భౌగోళిక గుర్తింపు ఉంది. 2017లో పశ్చిమ బెంగాల్ తమ రసగుల్లాలకు జీఐ ట్యాగ్ పొందడంతో రంగంలోకి దిగిన ఒడిశా చివరికి భౌగోళిక గుర్తింపును సాధించింది.