Pune: పుణె ఐటీ ఉద్యోగిని హత్యాచారం కేసులో దోషులకు శిక్ష తగ్గింపు
- ఉరిశిక్షను తగ్గించిన బాంబే హైకోర్టు
- అఘాయిత్యానికి పాల్పడిన పురుషోత్తం, ప్రదీప్
- ఏడేళ్లుగా శిక్షను అనుభవిస్తున్నామన్న దోషులు
22 ఏళ్ల యువతిపై 12 ఏళ్ల క్రితం జరిగిన హత్యాచారం కేసులో నేడు బాంబే హైకోర్టు తీర్పును వెలువరించింది. గతంలో పుణె సెషన్స్ కోర్టు విధించిన ఉరిశిక్షను 35 ఏళ్ల జైలు శిక్షకు తగ్గిస్తూ తీర్పును వెలువరించింది. విప్రో బీపీఓ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ పురుషోత్తం బోరాటె తన స్నేహితుడు ప్రదీప్ కొకడేలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె ఆనవాళ్లను కూడా తెలియనివ్వకుండా దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన పుణెలోని ఐటీ సంస్థలను వణికించింది. ఆమె హత్య జరిగిన తరువాతి రోజే పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
పుణెలోని సెషన్స్ కోర్టు దోషులకు 2012లో ఉరిశిక్ష విధించింది. తమ ఉరిశిక్ష అమలులో జాప్యం జరుగుతోందని, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, తమ శిక్షను తగ్గించాలని కోరుతూ దోషులు హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు వెలువడిన అనంతరం కూడా వీరు ఏడేళ్లుగా ఎరవాడ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారంటూ దోషుల తరుపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు గతంలో విధించిన ఉరిశిక్షను 35 ఏళ్ల జైలు శిక్షగా మారుస్తూ తీర్పును వెలువరించింది.