TikTok: కరీంనగర్లో విద్యార్థినులకు ‘టిక్‌టాక్’ ప్రొఫెసర్ వేధింపులు!
- ద్వంద్వార్థాల పాటలు, డైలాగ్‌లతో టిక్‌టాక్ వీడియోలు
- పరీక్షల్లో మార్కులు తక్కువ వేస్తానని బెదిరింపు
- వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
టిక్‌టాక్‌లో అసభ్య వీడియోలు చేసి వాటిని విద్యార్థినులకు పంపి వేధిస్తున్న కరీంనగర్ ప్రొఫెసర్ బాగోతం ఒకటి బయటపడింది. జిల్లాలోని తిమ్మాపూర్ ఉన్న శ్రీచైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ విభాగంలో సురేందర్ అనే వ్యక్తి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. టిక్‌టాక్‌లో వీడియోలు చేసి వాటిని విద్యార్థినులకు పంపి లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.
ద్వంద్వార్థాల పాటలు, డైలాగ్‌లతో అమ్మాయిలను వేధించడమే కాకుండా పరీక్షల్లో మార్కులు తక్కువ వేస్తానని, ఫెయిల్ చేస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నట్టు బాధిత విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ‘నువ్వంటే నాకిష్టం రా.. ఒకసారి రూముకు రావొచ్చుగా’ అంటూ ఓ యువతితో చేసిన అసభ్య చాటింగ్ కూడా బయటపడింది. అతడి వేధింపులు భరించలేని ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన తర్వాత అతడు చేసిన చాటింగ్‌ను, వీడియోలను బాధిత యువతులు బయటపెడుతున్నారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను నిందితుడు సురేందర్ కొట్టిపడేశాడు. తాను ఏదైనా చెప్పుకోవాల్సి వస్తే విద్యార్థినుల కుటుంబ సభ్యులకు చెప్పుకుంటానని పేర్కొన్నాడు. విషయం బయటకు రావడంతో పోలీసులు స్పందించారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. మరోవైపు కాలేజీ యాజమాన్యం సురేంద్రపై చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.