Tamilnadu: తమిళనాడులో నరబలి కలకలం!
- కనిపించకుండా పోయిన బాలుడు దారుణ హత్య
- పక్కనే చీకట్లో పూజలు చేస్తున్న 60 ఏళ్ల వృద్ధుడు
- కేసును విచారిస్తున్న పోలీసులు
15 సంవత్సరాల బాలుడు దారుణాతి దారుణంగా హత్య చేయబడి కనిపించగా, ఆ చుట్టుపక్కల గాలించిన పోలీసులకు, చీకట్లో పూజలు చేస్తున్న వృద్ధుడు కనిపించాడు. అతని దగ్గరకు వెళ్లబోగా పరిగెత్తే ప్రయత్నం చేశాడు. పట్టుకుని అతన్ని సోదా చేయగా, పసుపు, కుంకుమ, విభూది, నిమ్మకాయలు, బ్లేడు తదితరాలు కనిపించడంతో, ఈ హత్యను నరబలిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా ఉళుందూరుపేట సమీపంలోని అయన్కుంజరం గ్రామంలో జరిగింది.
కేశవన్, పరాశక్తి లకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా, చిన్న కుమారుడు శివకుమార్ (15) ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. గొర్రెలు మేపేందుకు వెళ్లిన తన అవ్వను వెతుక్కుంటూ ఆదివారం సాయంత్రం వెళ్లిన శివకుమార్ ఆచూకీ తెలియరాకపోగా బాలుడి తల్లి, అన్న, బంధువులు గాలించి పోలీసులను ఆశ్రయించారు.
ఈ క్రమంలో కుంజరం అడవుల్లో బాలుడి మృతదేహం ఉందన్న విషయం బయటకు రాగా, అక్కడికి వెళ్లిన పోలీసులకు మారుమూల గుట్టలో గొంతు కోసం హత్య చేయబడిన స్థితిలో శివకుమార్ కనిపించాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
కాగా, పోలీసుల అదుపులో ఉన్న 60 ఏళ్ల వృద్ధుడు, తనకు భూ వివాదం ఉందని, అందుకే అడవుల్లో పూజలు చేస్తున్నానని విచారణలో చెప్పాడు. ఈ వివాదం నుంచి బయటపడేందుకే బాలుడిని నరబలి ఇచ్చి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇదే సమయంలో గత వారంలో స్కూల్ క్రికెట్ పోటీలు జరుగగా, శివకుమార్ కు, ఇతర విద్యార్థులకు మధ్య గొడవలు వచ్చాయని తెలుసుకున్న పోలీసులు, ఏడుగురు విద్యార్థులను కూడా స్టేషన్ కు పిలిపించి ప్రశ్నిస్తున్నారు.