Triple Talak: బీజేపీ రాజ్యసభ సభ్యులను హెచ్చరించిన అమిత్ షా!
- నేడు రాజ్యసభ ముందుకు ట్రిపుల్ తలాక్ బిల్లు
- సంఖ్యాబలం తక్కువగా ఉన్నా... బిల్లును గట్టెక్కించాలనే పట్టుదలతో బీజేపీ
- బీజేపీ సభ్యులంతా సభలో ఉండాలంటూ ఆదేశించిన అమిత్ షా
బీజేపీ అత్యంత ప్+రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు వస్తోంది. సభలో తమకు సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ... ఎలాగైనా బిల్లుకు ఆమోదముద్ర వేయించుకోవాలనే కృతనిశ్చయంతో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో, తమ రాజ్యసభ సభ్యులకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ ఈరోజు సభకు హాజరుకావాలని ఆయన ఆదేశించారు.
ఈ ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ట్రిపుల్ తలాక్ బిల్లు ఓటింగ్ సమయంలో ప్రతి రాజ్యసభ సభ్యుడు సభలో ఉండాలని హెచ్చరించారు.
మరోవైపు, బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, టీఎంసీలు కూడా తమ సభ్యులందరూ సభలోనే ఉండాలంటూ విప్ జారీ చేశాయి. బీజేపీ మిత్రపక్షం జేడీయూ బిల్లులోని కొన్ని అంశాలను వ్యతిరేకిస్తోంది. బిజు జనతాదళ్ మాత్రం బిల్లుకు మద్దతు పలుకుతున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.
ఈ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఏ ఒక్క మతానికో ఈ బిల్లు వ్యతిరేకం కాదని చెప్పారు. లింగ సమానత్వం కోసమే బిల్లును ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ట్రిపుల్ తలాక్ ను ఇప్పటికే పలు ముస్లిం దేశాలు నిషేధించాయని అన్నారు.