Buddha Venkanna: తండ్రి శవం పక్కనుండగా జగన్ ను సీఎం చేయడానికి శవరాజకీయం చేసిన మీరా పాలన గురించి మాట్లాడేది?: బుద్ధా వెంకన్న
- విజయసాయిరెడ్డిపై బుద్ధా ధ్వజం
- జగన్ తెలివి తక్కువతనం కారణంగా లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారంటూ విమర్శ
- చిరుద్యోగుల గొంతు నొక్కుతున్నారంటూ మండిపాటు
టీడీపీ నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఓవైపు తండ్రి శవం పక్కన ఉండగానే, ఆయన కొడుకు జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి శవరాజకీయం చేసిన మీరు పాలన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ నిప్పులు చెరిగారు. దొంగలెక్కల కేసులో 16 నెలలు చిప్పకూడు తిన్నా మీకింకా బుద్ధి రాలేదంటూ మండిపడ్డారు. మీ పబ్బం గడుపుకోవడానికి ఎవరికాళ్లమీదనైనా పడడంలో మీరు పీహెచ్ డీ చేశారు కదా అంటూ చురకలంటించారు.
ఇప్పటికే ఏపీకి చెందిన సగం ఆస్తులు పొరుగు రాష్ట్రానికి ధారాదత్తం చేశారని, కేసీఆర్ కనుసన్నల్లో జరిగిన చీకటి ఒప్పందాలు వెలుగులోకి వస్తున్నాయని వ్యాఖ్యానించారు. బందరు పోర్టుపై జారీచేసిన రహస్య జీవో గురించి ఏంచెబుతారు అంటూ నిలదీశారు.
ఇక ముఖ్యమంత్రిగా జగన్ తీసుకుంటున్న తెలివి తక్కువ నిర్ణయాల వల్ల లక్షలమంది చిరుద్యోగులు ఉపాధి కోల్పోయారని ఆరోపించారు. చిరుద్యోగులు తమ గళం వినిపిస్తుంటే, వారి గొంతు నొక్కుతూ రాక్షసపాలన సాగిస్తున్నారని బుద్ధా మండిపడ్డారు. "సీఎం ఇంటి వద్ద 144 సెక్షన్ పెట్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన మీరు ఇప్పుడు పాలన గురించి మాట్లాడడమా? సిగ్గుచేటు" అంటూ ఘాటుగా స్పందించారు.