NIT: వార్షిక వేతనంలో సరికొత్త రికార్డు... వారణాసి ఐఐటీ టెక్కీకి రూ. 1.52 కోట్ల ఆఫర్!
- నూతన నియామకాల వెల్లువ
- నిట్, ఐఐటీ విద్యార్థులకు భారీ ఆఫర్లు
- ఉద్యోగాలు ఇచ్చేందుకు పోటీ పడ్డ కంపెనీలు
ఈ సంవత్సరం క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పాత రికార్డులు బద్దలయ్యాయి. ఐఐటీ కాన్పూర్ కు చెందిన ఓ విద్యార్థికి వచ్చిన రూ. 1.50 కోట్ల వార్షిక వేతనం ఆఫరే ఇంతవరకూ అత్యధికం కాగా, ఆ రికార్డును ఐఐటీ వారణాసి విద్యార్థి అధిగమించాడు. అతనికి ఓ కంపెనీ నుంచి రూ. 1.52 కోట్ల ఆఫర్ లభించింది. విద్యార్థి పేరును, కంపెనీని వెల్లడించని వారణాసి ఐఐటీ, ఈ సంవత్సరం మైక్రోసాఫ్ట్, గోల్డ్ మెన్ శాక్స్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్, జోమాటో, ఫేస్ బుక్ తదితర కంపెనీలు మంచి ఆఫర్లు ఇచ్చాయని తెలిపారు. వీటితో పాటు ఆదిత్య బిర్లా, క్యాటర్ పిల్లర్, మారుతి సుజుకి వంటి కంపెనీలు ఎంతో మంది విద్యార్థులకు ఆఫర్లు ఇచ్చాయని అన్నారు. మొత్తం 15 కంపెనీలు క్యాంపస్ నియామకాలను చేపట్టాయని అన్నారు.
కాగా, ఈ సంవత్సరం నిట్ న్యూఢిల్లీ (నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లోనూ విద్యార్థులు మంచి ఆఫర్లను దక్కించుకున్నారు. మెకెన్సీ, జబాంగ్, రిలయన్స్, జనరల్ మోటార్స్, ఈబే వంటి కంపెనీలు ముందస్తు నియామకాలు చేపట్టగా, ఓ విద్యార్థికి అత్యధికంగా రూ. 1.24 కోట్ల వేతన ఆఫర్ లభించింది. దక్షిణాది నిట్ లలో తిరుచిరాపల్లి నిట్ పాత రికార్డులను బద్దలు కొట్టింది. ఓ విద్యార్థికి రూ. 89.5 లక్షల ఆఫర్ లభించింది. అలహాబాద్ నిట్ లో 55 మందికి రూ. 25.50 లక్షల వేతనంతో ఉద్యోగాలను ఎల్అండ్ టీ, ఏబీబీ, హీరో, బ్లూ స్టార్ వంటి కంపెనీలు ఆఫర్ చేశాయి.