vijay mallya: ‘కాఫీ డే’ సిద్ధార్థలాగే నన్నూ వేధిస్తున్నారు : విజయ్‌మాల్యా
- ప్రభుత్వం, బ్యాంకుల వేధింపులకు సిద్ధార్థ సంఘటన ఓ ఉదాహరణ
- ఇవి ఎంతటి వారినైనా నిరాశలోకి నెట్టగలవు
- డబ్బు కట్టేస్తామన్నా తమ మాటలు పట్టించుకోరన్న మాల్యా
మంచి వ్యక్తిత్వం, తెలివైన వ్యాపారవేత్త ‘కాఫీ డే’ సిద్థార్థ మృతి ఘటన ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకుల వేధింపులకు ఓ ఉదాహరణ అని, తనను కూడా అలాగే వేధిస్తున్నారని వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని పోస్టు చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు ఎంతటి ధీరోదాత్తులనైనా నిరాశలోకి నెట్టేయగలవన్నారు.
బకాయిలన్నీ చెల్లించేస్తానని తాను చెబుతున్నా తనను ఎలా వేధిస్తున్నారో ఒకసారి గమనించాలని మాల్యా కోరారు. పాశ్చాత్య దేశాల్లో అయితే తమ లాంటి వారికి సాయం చేసి పునరుజ్జీవనం పొందేందుకు అండగా నిలబడతారని, భారత్‌లో ఆ పరిస్థితి లేదన్నారు. తాను బ్యాంకుకు చెల్లించాల్సిన అప్పుకోసం చేస్తున్న అన్ని ప్రయత్నాలను ప్రభుత్వ ఏజెన్సీలు అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తాడు.
నేత్రావతి నదిలో మునిగి శవమై తేలిన బిజినెస్ టైకూన్ సిద్థార్థ చనిపోయేందుకు ముందు రాసిన లేఖలో ఆదాయ పన్ను విభాగం మాజీ డీజీ వేధింపులు, ఓ ప్రైవేటు ఈక్విటీ సంస్థలోని భాగస్వాములు షేర్లను బైబ్యాక్ చేయాలని చేస్తున్న ఒత్తిడిని ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీనిపై మాల్యా ఇలా ట్విట్టర్లో స్పందించారు.