Rolls Royce: 'రోల్స్ రాయిస్ పీఎల్సీ' కంపెనీపై సీబీఐ కేసు.. వివరణ ఇచ్చిన కంపెనీ!
- ప్రభుత్వ రంగ సంస్థల కాంట్రాక్టుల కోసం అడ్డదారులు తొక్కిన రోల్స్ రాయిస్ పీఎల్సీ
- ఓ ఏజెంట్ కు రూ. 77 కోట్లు చెల్లించిన వైనం
- పలువురు అధికారులపై కూడా కేసు నమోదు
ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లు, ప్రధాన విడి భాగాలు తయారు చేసే రోల్స్ రాయిస్ పీఎల్సీ (రోల్స్ రాయిస్ కార్ల కంపెనీ కాదు) పై సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కాంట్రాక్టులను దక్కించుకునేందుకు ఓ ఏజెంట్ కు రూ. 77 కోట్ల కమిషన్ ను రోల్స్ రాయిస్ పీఎల్సీ చెల్లించిందని సీబీఐ దర్యాప్తులో నిర్ధారించింది. ఈ కేసును సీబీఐ దాదాపు ఐదేళ్ల పాటు దర్యాప్తు చేసింది. 2007-11 మధ్య కాలంలో ఈ కాంట్రాక్టుల లావాదేవీలు జరిగాయని సీబీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో, రోల్స్ రాయిస్ పీఎల్సీతో పాటు భారత అనుబంధ సంస్థలైన హెచ్ఏఎల్, ఓఎన్జీసీ, గెయిల్ లలో పని చేస్తున్న కొందరు అధికారులపై కూడా కేసు నమోదు చేసింది.
ఇదిలా ఉంచితే, లండన్ కు చెందిన రోల్స్ రాయిస్ కంపెనీ ఈ వార్తలను ఓ ప్రకటనలో ఖండించింది. ఈ కేసు తమ సంస్థకు సంబంధించినది కాదనీ, ఈ విషయంలో సీబీఐని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపింది. తమ సంస్థ అత్యున్నత నైతిక విలువలకు కట్టుబడి వున్న సంస్థ అనీ, ఎవరు ఎటువంటి అనైతిక కార్యకలాపాలకు ఏ రూపంలో పాల్పడినా సహించేది లేదని పేర్కొంది. తమ సంస్థ తరఫున ఎవరూ ఇండియాలో పనిచేయడం లేదని స్పష్టం చేసింది. భారత్ తమకు ప్రధాన మార్కెట్ ప్రదేశమని, నైపుణ్యం గల ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారని తెలిపింది.
ఇదే సమయంలో రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ సంస్థకూ, రోల్స్ రాయిస్ పీఎల్సీ సంస్థకూ వున్న తేడాను కూడా వివరించింది. రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ సంస్థ బీఎండబ్ల్యూ గ్రూపునకు చెందినదని, రోల్స్ రాయిస్ పీఎల్సీ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లను, విడి భాగాలను తయారు చేసే ప్రత్యేక సంస్థ అనీ సదరు సంస్థ అధికార ప్రతినిధి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.