Supreme Court: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కేంద్రం నిర్ణయం
- సీజేఐను మినహాయించి న్యాయమూర్తుల సంఖ్య 30 నుంచి 33కు పెంచాలని నిర్ణయం
- పార్లమెంటులో త్వరలో బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- 2009లో న్యాయమూర్తుల సంఖ్యను 26 నుంచి 31కి పెంచారు
సుప్రీంకోర్టులో 58 వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వీటిని పరిష్కరించాలంటే న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంటులో త్వరలో ఓ బిల్లును ప్రవేశపెట్టనుంది.
దీని ప్రకారం, సీజేఐను మినహాయించి మిగిలిన న్యాయమూర్తుల సంఖ్యను 30 నుంచి 33కు పెంచాలని నిర్ణయించింది. ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే కనుక సీజేఐతో సహా న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరనుంది. కాగా, సుప్రీంకోర్టులో 2009లో న్యాయమూర్తుల సంఖ్యను 26 నుంచి 31కి పెంచారు. అయినప్పటికీ పెండింగ్ కేసుల భారం తగ్గలేదు. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను మరోమారు పెంచాలని కేంద్రం నిర్ణయించడం గమనార్హం.