Jagan: ప్రధాని మోదీతో భేటీ కానున్న జగన్
- ఆగస్ట్ 6న మోదీతో జగన్ భేటీ
- భేటీకి హాజరుకానున్న విజయసాయిరెడ్డి, పలువురు మంత్రులు, అధికారులు
- పోలవరంకు నిధులు విడుదల చేయాలని కోరనున్న జగన్
ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ కానున్నారు. ఆగస్టు 6న వీరి సమావేశం జరగనుంది. ఈ భేటీకి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్, మేకపాటి గౌతమ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పాటు జల వనరులు, పరిశ్రమలు, ఆర్థిక శాఖల ప్రత్యేక కార్యదర్శులు కూడా హాజరుకానున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 5 వేల కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉంది. ఇందులో రూ. 3,600 కోట్లను మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ నిధులను త్వరగా విడుదల చేయాలని మోదీని జగన్ కోరనున్నారు. కడప స్టీల్ ప్లాంట్, విద్యా సంస్థలకు నిధులు, వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు, ప్రత్యేక హోదా, దుగరాజపట్నం పోర్టు, ఆర్థికలోటు భర్తీ తదితర అంశాలను కూడా ప్రధాని దృష్టికి జగన్ తీసుకెళ్లనున్నారు.