Tamilnadu: నేటి నుంచి అత్తివరదరాజుని విశ్వరూప దర్శనం... 18న జలగర్భంలోకి... తిరిగి కనిపించేది 2059లోనే!
- 32 రోజులుగా శయనమూర్తిగా దర్శనం
- 17 వరకూ నిలుచున్న రూపంలో కరుణించనున్న స్వామి
- 18న జలగర్భ ప్రవేశ వేడుకకు ఏర్పాట్లు
తమిళనాడులోని కాంచీపురంలో గడచిన 32 రోజులుగా శయనమూర్తిగా భక్తులకు దర్శనమిస్తున్న అత్తివరదరాజ స్వామి, నేటి నుంచి నిలుచుని విశ్వరూప అవతారంలో కనిపించనున్నారు. కంచిలో అత్తివరదరాజ స్వామి దర్శనం ప్రతి 40 సంవత్సరాలకూ ఒకసారి మాత్రమే ఉంటుందన్న సంగతి తెలిసిందే.
ఈ నెల 17 వరకూ నిలబడి దర్శనం ఇచ్చే స్వామి, ఆపై కోనేటి జల గర్భంలోకి ప్రవేశిస్తారు. ఈ 18న ఇది జరుగనుంది. దీన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మానవ జీవితంలో ఒక్కమారు మాత్రమే అత్తవరదరాజ దర్శనం అవుతుందని భావించే భక్తులు, లక్షల సంఖ్యలో కంచికి తరలి వస్తున్నారు. 18న జలగర్భ ప్రవేశం చేసే స్వామిని తిరిగి 2059లో బయటకు తీస్తారు. అప్పుడు కూడా 32 రోజుల పాటు శయనమూర్తిగా, ఆపై మరో 18 రోజులు నిలుచున్న మూర్తిగా దర్శనమిచ్చి జలగర్భంలోకి ప్రవేశిస్తాడు.