Jagan: గరుడ వారధి పనులకు టీటీడీ నిధులా?... జగన్ వెంటనే స్పందించాలన్న బీజేపీ నేత
- ప్రభుత్వ కార్యక్రమాలకు శ్రీవారి నిధులు ఖర్చుచేయకూడదన్న బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి
- టీటీడీ నిధులు ధార్మిక కార్యక్రమాల కోసమే వెచ్చించాలంటూ స్పష్టీకరణ
- టీటీడీ కేటాయించిన నిధులు రద్దుచేయకపోతే ఉద్యమం చేస్తామని వెల్లడి
తిరుమల వెంకన్న దర్శనార్థం దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కారణంగా తిరుపతిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండడంతో పరిష్కార మార్గంగా గరుడ వారధి ప్రాజక్టుకు రూపకల్పన చేశారు. ఇది సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఎక్స్ ప్రెస్ ఫ్లై ఓవర్! అయితే, ఈ ప్రాజక్టు కోసం టీటీడీకి చెందిన నిధులు కేటాయించడంపై రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి స్పందించారు. గరుడ వారధి పనుల కోసం టీటీడీ రూ.458 కోట్లు కేటాయించడంపై సీఎం జగన్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేటాయింపును రద్దు చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల కోసం టీటీడీ నిధులు మళ్లించకూడదని అన్నారు. యాక్ట్ 30 అనుసరించి టీటీడీ నిధులను కేవలం ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల కోసం కేటాయించాలని మాత్రం స్పష్టం చేశారు.