Botsa Satyanarayana: అన్న క్యాంటీన్లను మూసివేయడం లేదు: బొత్స
- అన్న క్యాంటీన్లు మూతపడుతున్నాయంటూ ఆరోపణలు
- స్పందించిన మంత్రి బొత్స
- నిర్వహణ లోపాలను సరిదిద్దుతున్నామంటూ వివరణ
ఆంధ్రప్రదేశ్ లో అత్యంత చవకగా భోజనం అందిస్తూ పేద, మధ్యతరగతి వర్గాలకు బాగా చేరువైన అన్న క్యాంటీన్లను ప్రభుత్వం మూసివేస్తోందంటూ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అన్న క్యాంటీన్లను మూసివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అన్న క్యాంటీన్ల నిర్వహణలో ఉన్న లోపాలను సరిదిద్దుతున్నామని, ప్రజలకు మరింత చేరువయ్యే రీతిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని వివరణ ఇచ్చారు. త్వరలోనే సరికొత్తగా, రాయితీలపై క్యాంటీన్లు పునఃప్రారంభమవుతాయని బొత్స పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎంతో ఆర్భాటంగా గత సర్కారు క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని, అయితే వాటి నిర్మాణానికి సంబంధించి కోట్ల రూపాయల బిల్లులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని, నిర్వహణ చార్జీలు కూడా చెల్లించలేదని ఆరోపించారు. పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన 182 అన్న క్యాంటీన్లలో సరైన ప్లానింగ్ లేకుండా ఏర్పాటు చేసినవే అధికంగా ఉన్నాయని విమర్శించారు,