Siddipet District: చింతమడకలోనే కాదు రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఇవ్వాలి: భట్టి విక్రమార్క డిమాండ్
- చింతమడక ప్రజలకు లబ్ధి చేకూరుస్తామని కేసీఆర్ చెప్పారు
- రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు అదే తరహాలో లబ్ధి చేకూర్చాలి
- ఈ పథకానికి ‘చింతమడక స్కీమ్’ అని పేరు పెట్టారు
సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు లబ్ధి చేకూరుస్తామని ఇటీవలే ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేయడం తెలిసిందే. కేసీఆర్ చేసిన ఈ ప్రకటన గురించి టీ-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. తెలంగాణలోని అన్ని కుటుంబాలకు చింతమడక తరహాలోనే లబ్ధి చేకూర్చాలని, ఈ పథకానికి ‘చింతమడక స్కీమ్’ అని పేరు పెట్టినా తమకు అభ్యంతరం లేదని అన్నారు.
రాష్ట్రంలోని ప్రజలందరినీ సమదృష్టితో కేసీఆర్ చూడట్లేదన్న భావన ప్రజల్లో కలిగితే వారిలో అశాంతి పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. అందుకే, ఈ పథకం ఏర్పాటుపై కేసీఆర్ వెంటనే ఓ నిర్ణయం తీసుకోకపోతే అర్హులైన కుటుంబాలను కూడగట్టే ప్రయత్నం చేస్తామని హెచ్చరించారు. చింతమడక ప్రజలకు ఇస్తానన్నది సీఎం సొంత సొమ్ము ఏమీ కాదని అన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు సందర్శనకు మీడియా ఎడిటర్లను తీసుకెళ్లాలన్న నిర్ణయం హర్షణీయమని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనకు సంబంధించిన సమగ్ర నివేదికతో పాటు తీసుకొచ్చిన అప్పుల వివరాల ప్రతులను మీడియాకు చూపించాలని సూచించారు.